DASARAA
దసరా ముఖ్యమైన పండుగ ఒకటి. ఇది పదిరోజుల పండుగ. కనుక దీనికి దసరా అని పేరు వచ్చింది. ఈ పండుగ ఆశ్వయుజ
శుక్లపాడ్యమి మొదలు దశమితో పూర్తి అవుతుంది. తొమ్మిది రాత్రులు ఉన్నందున నవరాత్రులని,మహిషాశురుణ్ణి దుర్గాదేవి సంహరించినందున దేవినవరాత్రులని,శరదృతువుతో మొదలైనందున శరద్ నవరాత్రులని అంటారు.
మొదటి రోజు బొమ్మలకొలువు పెట్టి,మధ్యలో కలశం పెట్టి రోజూ పూజచేసి నైవేద్యం పెడతారు. సాయంత్రము ముతైదువులను పేరంటానికి పిలిచి తాంబూలాలు ఇస్తారు. పాటలు వచ్చిన వారు పాడతారు. ఇంట్లో ఉండే పాత బొమ్మలతో పాటు ప్రతి సంవత్సరం కొత్త బొమ్మలు కొని చక్కని రీతిలో పెడతారు. పార్కులని,మెడని అలా అమరుస్తారు. ఇక చేతితో చేసిన బొమ్మలని మొదలైన వాటిని ఈ కొలువులో ఉంచుతారు. పది రోజులు వీలుకాని వారు ముఖ్యమైన నాలుగు రోజులైనా అంటే సరస్వతి పూజ(సప్తమి,మూల నక్షత్రం) రోజు,దుర్గాష్టమి,మహర్నవమి,విజయదశమి బొమ్మల కొలువు పెడతారు. సరస్వతి పూజ రోజు పుస్తకాలు పెట్టి పూజిస్తారు. అంటే ఏయే వృత్తుల వారు వారి పరికరాలను పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో "దుర్గాష్టమిని" ఆయుధాల పూజ అంటారు.
ఇక విజయదశమి రోజున శమి పూజ (జమ్మిచెట్టుకు పూజ) చేస్తారు. కొన్ని జిల్లాలలో ఒకరికొకరు స్నేహంగా ఉండాలని జమ్మి ఆకును ఒకరికొకరు ఇచ్చుకుంటూ "శమి శమీతే పాపం, శమి శత్రు వినాజనం,అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ" అని మంత్రం చెప్తారు. దీని పధానత ఏమనగా అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు అర్జునుడు తన ధనుర్భాణాలను శమి వృక్షంపైన దాచి అజ్ఞాత వాసం పూర్తి కాగానే విజయదశమి రోజు వాటిని తీసుకున్నాడు అని ప్రతీతి.
పిల్లలకు పాఠశాలలకు సెలవులైనందున వాళ్ళ మాస్టారు పిల్లలను ఇంటికి పిలుచుకొని వస్తాడు. పిల్లలు "అయ్యవారికి చాలు ఐదు వరహాలు (వరహా అంటే నాలుగు రూపాయలు),పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు" అంటూ పాడుతూ వస్తారు.
దసరాలో వేషాలు కూడా వేస్తారు. ఇక అమ్మవారి గుళ్ళల్లో రోజుకో రకంగా అమ్మవారికి అలంకారం చేస్తారు.
ప్రస్తుతం ఒక దృశ్యాన్నంతా ఒకే బొమ్మలో ఇమిడి పోయేటట్లు తయారు చేస్తున్నారు. ఉదాహరణకు వరినాట్లు,సహపంక్తి భోజనాలు,పెండ్లితంతు,మైదానంలో ఆటలు,తరగతి గది,టీచర్,పాఠాలు ఇలాంటివి కనుక బొమ్మలు పెట్టడం సులభమౌతుంది.
ఈ పండుగ లలిత కళలను,హస్తకళలు,సంప్రదాయాన్ని అభివృద్ధి చేస్తూ మనలోని శక్తి,సామర్థ్యాలు,భక్తిని,ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది.
****
టి. ప్రభావతి దేవి (ప్రస్తుతం కడప),రిటైర్డ్ హిందీ టీచర్,
అనంతపురము. చరవాణి : 09642383659 (౦౯౬౪౨౩౮౩౬౫౯)