SREE RAAMA NAVAMI FESTIVAL

           శ్రీరామ నవమి   (22) TPD
 
చైత్రశుద్ద నవమి రోజు మనము శ్రీరామ నవమిని జరుపుకుంటాము. అంటే ఉగాది తరువాత ఎనిమిది రోజులకు శ్రీరామ నవమి వస్తుంది. ఆరోజు శ్రీరాముడు పుట్టినరోజు. ఆరోజు మనమందరం ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానమాచరించి శ్రీరాముని పూజిస్తాము. మంచి ఎండకాలమైనందున పిండివంటలే కాకుండా వడపప్పు (నానిన పెసరపప్పు),పానకం,నీరు మజ్జిగ శ్రీరాముని నైవేద్యం పెడతాము. క్రొత్త విసనకర్రలు తెచ్చి వాటికి పసుపు పూసి ముతైదువులకు,బ్రాహ్మణులకు తాంబూలాలు,విసనకర్రలు యిస్తాం. ఇక సాయంత్రం వరకు వచ్చిన వారికందరికి పానకం,వడపప్పు యిస్తాం. గుళ్ళలో మరికొంతమంది విడిగా వడపప్పు, పానకం యిస్తూ ఉంటారు. ఎండాకాలం గనుక బెల్లం పానకం తాగితే సేద తీరుతుంది. పుణ్యమని అలా చేస్తుంటారు. ఇక కొన్ని దేవాలయాల్లో మూడు లేక తొమ్మిది రోజులు శ్రీరామోత్సవాలను జరుపుతారు. కడపటి మూడు రోజులు  సీతారామకళ్యాణం,పట్టాభిషేకం,
ఏకాంతసేవ జరుపుతారు. శ్రీరాముడు అయోధ్యరాజైన దశరథుని కుమారుడు. ఈయన ఎంతో అందమైనవాడు. చిన్నపిల్లవాడుగ ఉన్నప్పుడే అయోధ్య ప్రజలు రాముడిని చూచుటకు ఉదయము,సాయంత్రము రాజభవనం దగ్గరకు వచ్చేవారట. ఇక మనం రామునికి మంగళ హారతి ఇచ్చేటప్పుడు "పుంసాం మోహన రూపాయ" అని అంటాము. అంటే రాముడు పురుషులకు కూడా విరహము కలిగించేంతటి అందగాడని అర్థం. ఆయన ఆజానుబాహుడు,నీలమేఘశ్యాముడు. రాముడు పితృవాక్య పరిపాలకుడు. కనుకనే ఆయన తండ్రి మాటను నిలబెట్టుటకు పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసము చేసాడు. ఆ పద్నాలుగు సంవత్సరాలలో అనేక మంది దుష్ట రాక్షసులను సంహరించి శిష్ట రక్షణ చేసాడు. వాలిని సంహరించి సుగ్రీవుని రాజుగా చేసాడు.ఈవిధంగా మానవులకేగాక,వానరులను కూడా కాపాడాడు. అందుకే ఆంజనేయ స్వామి రాముని పరమభక్తుడయ్యాడు. లంకా రాజైన రావణాసురుని సంహరించి ఆయన చెరలోఉన్న సీతాదేవిని విడిపించి తెచ్చుకున్నాడు. రావణుని తమ్ముడైన విభీషణునికి పట్టాభిషేకం చేశారు. రావణాసురుడు మరణావస్థలో ఉండగా రాముడు లక్ష్మణునితో రావణాసురుని వద్దకు వెళ్ళిరా. రాజనీతిని తెలుసుకొని రమ్మంటాడు. కాని రావణుడు రాముడిని రమ్మని చెప్పి లక్ష్మణుడిని పంపిచేస్తాడు. రాముడు వెళ్లి రావణునికి కనబడిన వెంటనే రావణాసురుడు రామునితో...తన ఆఖరి సమయంలో రామదర్శన భాగ్యము కొరకు రాముడినే రమ్మన్నానని చెప్పాడు. రాముని పితృవాక్య పరిపాలన,కుటుంబంలో అన్నదమ్ముల ప్రేమాభిమానాలు, తల్లి, పిన తల్లులతో ఎలా ఉండాలి. భార్యను ఎలా ప్రేమగా చూడాలి అనే యిలాంటి వాటికి రాముడు ఆదర్శప్రాయుడు. ఇక ఆయన రాజ్యంలో ప్రజలు ఎలాంటి కష్టాలు,నష్టాలు లేక సుఖంగా జీవించారు. అందుకే ఈరోజు కూడా అందరు దేశం రామరాజ్యంలాగా వుండాలి అని ఆశిస్తారు. ఇక దంపతులను సీతారాముల్లాగా ప్రేమాభిమానాలతో ఉండాలని ఆశిస్తారు. రామా అంటే రమింపచేసేవాడు. ఇక శ్రీరామ అంటే శ్రీ అంటే సిరి (లక్ష్మి) ఆయన పేరుకు శ్రీ ని చేర్చి శ్రీరామా అంటున్నాము. అంటే సీతారామ అని అర్థం. విష్ణువు యొక్క దశావతారములలో ఏడవ అవతారము రామావతారము. ఆయనను మర్యాద పురుషోత్తముడని అంటారు. మర్యాద అంటే హద్దు అని అర్థం.
 శ్లోకం: 
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 
అంటే ఈ శ్లోకం చదివితే విష్ణుసహస్రనామం చదివినట్టు. అంటే రాముని మహిమ ఎంత గొప్పదో దీనివల్ల మనం తెలిసికోగలము. రాముడిని కోదండ రాముడంటారు. అంటే ఆయన శివ ధనస్సును విరిచి సీతమ్మను పెండ్లాడారు. రాముడు విలు విద్యా పారీణుడు,రామ బాణానికి తిరుగుండదు. ఆయన బాణాన్ని సందించినట్లైతే దాని ఫలితాన్ని అనుభవించి తీరాలి. దానికి తిరుగుండదు. రాముడు ఏకపత్నీ వ్రతుడు. అందుకే అశ్వమేధ యజ్ఞము చేసేటప్పుడు సీతమ్మ అడవుల్లో వుంటే ఆయన బంగారు సీతను భార్యస్థానంలో వుంచుకొని యజ్ఞం చేశారు. ఏ శుభాశుభములైన భర్తకు భార్య ప్రక్కన వుండటం మన సాంప్రదాయం. అందుకే భార్యను అర్ధాంగి అంటాం.

 ***టి.ప్రభావతి దేవి, రిటైర్డ్ ప్రైవేట్ హిందీ టీచర్, (శాంతిని కేతన్, ఎల్.ఆర్.జి,వినయకుమార్,గుడ్ శప్పర్డ్ స్కూల్స్ లో),అనంతపురం. కుమారుడు:టి.ఉదయ భాస్కర్,మొబైల్:9642383659 ***

Comments

Popular posts from this blog