UGADI FESTIVAL


               ఉగాది      టి.పి.డి ( 18)     
 
           
                   తెలుగు సంవత్సరాదిని  "ఉగాది" అంటాము. తెలుగు సంవత్సరములు అరవై.  ఈరోజు............ నామ సంవత్సరం ప్రారంభం.  అలాగే తెలుగు ఋతువులలో మొదటిది వసంత ఋతువు. చైత్రమాసము,శుక్లపక్షం తిధులలో మొదటిది పాడ్యమి ప్రారంభం. ఈరోజు మనమంతా ఉగాది పచ్చడి చేసుకుంటాము. ఇది షట్ (ఆరు) రుచులతో కూడి ఉంటుంది. దీనిలో వేపపువ్వు చేదునకు, మామిడి ముక్కలు వగరుకు,బెల్లం తీపుకు,చింతపండు పులుపుకు,కారం,ఉప్పు కలిసి ఉంటాయి. అనగా దీని అర్థం మన జీవితంలో కూడా ఇలాగే అనేక రకములైన అనుభవాలు,కష్ట సుఖాలు ఉంటాయి. ఈ పచ్చడి ఎలా రుచిగా ఉంటుందో అలాగే మానవ జీవితం కూడా అనేక అనుభవాలతో ముందుకు సాగి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అన్ని అనుభవించినప్పుడే జీవితం పరిపూర్ణము అవుతుంది. అందుకే ఈ పచ్చడికి అంత ప్రాధాన్యత. ఈ పండుగను మహారాష్ట్రలో గుడిపాడవా అని,వేరే రాష్ట్రంలో వేరే వేరే పేర్లతో జరుపుకొంటారు.
                 ప్రతి సంవత్సరం తెలుగు పంచాంగం ఉంటుంది. పంచాంగం అనగా తిథి, వారము,నక్షత్రము,యోగము,కరణము అను ఐదు అంగములు కలది. ఆ సంవత్సరము ఏ నెలలో,ఏ తిథి,వారము,నక్షత్రము వస్తుందో తెలుసుకోవచ్చు. ఇక ఆసంవత్సరము వచ్చే సూర్య, చంద్రగ్రహణములు,శుక్ర గురు మూఢముల ప్రారంభము, త్యాగము ఉంటాయి. శుభముహూర్తములు,జాత శౌచాది విషయములు,పద్ధతులు అన్ని ఉంటాయి. ఆ సంవత్సరపు వర్షయోగములు,పాడిపంటలు మొదలైన విషయాలన్నీ వుంటాయి. పంచాంగమును అనుసరించే భారతీయులు మంచి,చెడు ఆచరిస్తారు. 

ఏ పండుగ ఎప్పుడు వస్తుందో అన్ని వివరంగా వుంటాయి. ఇంగ్లీష్ వాళ్లకు ఇంగ్లీష్ నెలలు,తేదీలు ఎలాగో మనకు పంచాంగం అలాంటిది.  ఇంగ్లీషులో తేదీని డేట్ అంటాము.  తెలుగులో తిథి అంటాము.
                    ఆ సంవత్సరం కలిపురుషుడు ఏ వాహనంపై వస్తాడో కూడా ఉంటుంది.  దాన్ని బట్టి మంచి,చేదు చెపుతూ ఉంటారు.  ఆ సంవత్సరంలో పుష్కరాలు వచ్చేటట్టయితే దాని వివరాలు, విధులు ఉంటాయి.  ఎవరు పుట్టినా,మరణించినా పంచాంగంలో తిథి,వార,నక్షత్రాలను చూచి మంచి చెడులను నిర్ణయిస్తారు.  ఇలా పంచాంగానికి మనకు విడదీయరాని సంబంధముంది.  అందుకే ప్రతి యింటా కొత్త సంవత్సరం పంచాంగం కొని ఉగాది రోజున దేవునివద్ద వుంచి పూజిస్తారు.  ఇలా పంచాంగానికి ప్రాధాన్యత ఉంది. మధ్యాహ్నం పండితులు పంచాంగాన్ని చూచి అన్ని విషయాలు మనకు వినిపిస్తారు.  ఈ పండుగ సాధారణంగా మార్చి నెలలో వస్తుంది.  అధిక మాసం వచ్చినపుడు ఏప్రిల్ లో వస్తుంది.  మనది చాంద్రమాసం.  కానీ తమిళులు సూర్యమానాన్ని అనుసరిస్తారు.  అందుచేత వాళ్ళు సూర్యుడు (మొదటి రాశి) మేషరాశిలోకి ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదునాల్గవ తేదీ ప్రవేశిస్తాడు.  ఆ రోజు తమిళులు ఉగాది పండుగ చేసుకొంటారు. 
                   రాసులు పన్నెండు.  సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్క రాశిలోకి ప్రవేశిస్తాడు.  మొదట యుగాది అనేవారు.  అంటే యుగమునకు మొదలు. కాలక్రమేణ యుగాదే. ఉగాదిగా వాడుకలోనికి వచ్చింది.

****టి.ప్రభావతి దేవి,
రిటైర్డ్.ప్రయివేట్ హిందీ టీచర్,
అనంతపురము*****
****ఫోన్: 9642383659 (౯౬౪౨౩౮౩౬౫౯)***

Comments

Popular posts from this blog